ప్రైజ్ మనీ ఎగ్గొట్టారు.. ఓంకార్ షోపై సెన్సేషనల్ కామెంట్స్!
on Apr 24, 2021
అప్పట్లో 'ఢీ' డాన్స్ షోకి ధీటుగా 'ఆట' అనే డాన్స్ షోని మొదలుపెట్టాడు యాంకర్ ఓంకార్. ఈ షోతోనే అతడికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. సుందరం మాస్టర్, అమ్మ రాజశేఖర్, నటరాజ్ తదితరులు జడ్జీలుగా వ్యవహరించిన ఈ షో అప్పట్లో మంచి టీఆర్పీ తీసుకొచ్చింది. భరత్, సన్నీ, సందీప్, తేజు లాంటి డాన్సర్లు ఈ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 'ఢీ'లో చేసిన వాళ్లు స్టార్ కొరియోగ్రాఫర్లుగా మారితే 'ఆట'లో చేసిన వారెవరికీ సరైన అవకాశాలు రాలేదు. ఇదిలా ఉండగా.. 'ఆట' సీజన్ 5, సీజన్ 6 విజేతగా నిలిచిన సన్నీ మాస్టర్ ఈ షోపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
"మా అదృష్టం బాలేదో.. లేక మేం ఎన్నుకున్న ఫ్లాట్ ఫామ్ మంచిది కాదో తెలియదు కానీ.. ఆట షోలో చేసిన డాన్స్ మాస్టర్స్ ఎవరికీ పేరు రాలేద"ని సన్నీ అన్నారు. 'ఢీ'లో చేసిన డాన్స్ మాస్టర్స్ అంతా ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్లుగా ఉన్నారని.. కానీ తాము మాత్రం అక్కడే ఆగిపోయామని చెప్పారు. ఆట రెండు సీజన్లలో విన్నర్ గా నిలిచినా తనకు ఒక్క రూపాయి కూడా ప్రైజ్ మనీ ఇవ్వలేదని అన్నారు. "జీ వాళ్లకు ఫోన్ చేసి అడిగితే.. ఎవరో వచ్చి చెక్ తీసుకున్నారని.. తామైతే ప్రైజ్ మనీ ఇచ్చేశామని అన్నారు. సీజన్ 6 సమయంలో కూడా ఇలానే చేశార"ని చెప్పుకొచ్చారు.
సీజన్ 6లో తన కంటెస్టెంట్ గా ఆరేళ్ల బాబుని ఇచ్చారని.. అతను మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా బాగా చేసేవాడని.. చివరికి టైటిల్ కూడా సంపాదించాడని చెప్పారు. "ఆ సమయంలో రెండు లక్షల ప్రైజ్ మనీ అని చెప్పారు. విన్నర్ కి లక్ష, మాస్టర్ కి లక్ష. అయితే ఇప్పటివరకు ఆ ప్రైజ్ మనీ రాలేదు." అని అన్నారు. ఆ పిల్లాడి తండ్రి రైల్వేలో కూలి అని.. తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం సన్నీ దర్శకుడిగా మారి ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. అలానే కన్నడలో రియాలిటీ షోలకి పని చేస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
